విశాఖపట్నం:ఎల్జీ పొలిమెర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై-పవర్ కమిటీ, సోమవారం ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి 350 పేజీల తుది నివేదికను సమర్పించింది. యాజమాన్య నిర్లక్ష్యం మరియు భద్రతా లోపాల కారణంగానే ఈ ఘటన జరిగిందని కమిటి ఛైర్మన్ నీరబ్ కుమార్ తమ నివేదిక లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫ్యాక్టరీలో 36 చోట్ల అల్లారం పాయింట్‌లున్నా ప్రమాదం జరిగిన సమయంలో సైరన్ మోగించలేదని, యాజమాన్యం అలారమ్ ఆన్ చేయకపోవడం అతి పెద్ద నిర్లక్ష్యంగా భావిస్తున్నట్టు కమిటి చైర్మన్ మీడియాతో అన్నారు.
ఓ వైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరగడం, స్టైరిన్ బాయిలింగ్ పాయింట్‌కు చేరడం, ఆవిరి రూపంలో బయటకు వెళ్లడం, స్టైరిన్‌ను అదుపు చేసేందుకు కావాల్సిన రసాయనాలు పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీ లో లేకపోవడంతో ఇది గ్యాస్ లీక్ కు దారితీసిందని, దాని ప్రభావం వల్ల 13 మంది మరణించారు మరియు వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు అని కమిటీ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా ఫ్యాక్టరీలో “ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటించలేదని, గ్యాస్ లీక్‌కు ఫ్యాక్టరీ వద్ద ఉన్న సిబ్బంది ఆలస్యంగా స్పందించారని, ట్యాంక్ యొక్క పాత రూపకల్పన, ఉష్ణోగ్రత పర్యవేక్షణ మరియు శీతలీకరణ వ్యవస్థల మధ్య ఇంటర్‌లాక్ వ్యవస్థ అమరిక సరిగా లేకపోవడం గ్యాస్ లీక్‌కు మూల కారణం” అని . స్టైరిన్ మోనోమర్ నిల్వ చేసిన ట్యాంక్ రూపకల్పన ఎందుకు మార్చబడింది అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరిగిందని, దానికి సంబంధించిన సమాచారాన్ని రిపోర్ట్ లో పొందుపరిచామని నీరబ్ కుమార్ వెల్లడించారు .
అలాగే ప్రమాదకర రసాయనాల ఫ్యాక్టరీలను జనావాసాల కంటే దూరంగా ఏర్పాటు చేయాలని, మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎల్జీ పాలిమర్స్‌ను వేరే ప్రాంతానికి తరలించడం మంచిది అనే మా అభిప్రాయం’ అని నివేదికలోని వివరాలు పేర్కొన్నారు.