కొలంబో: ఇటీవలే కృనాల్ పాండ్యా లంకలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే నిన్న జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో ఓడి టీ20 సిరీస్ ను కోల్పోయిన బాధలో ఉన్న భారత్ కు మరొక షాక్ ఎదురైంది. ఇప్పుడు భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మరియు కె. గౌతమ్‌లకు ఇవాళ కరోనా పాజిటివ్ గా తేలింది.
ఈ ఇద్దరు ఆటగాళ్ళు చాహల్, గౌతమ్‌లు ఇప్పటికే క్వారంటైన్‌లో గడుపుతున్నారు. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు కృనాల్ పాండ్యా కరోనా బారీన పడడంతో తనతో క్లోజ్‌గా ఉన్న 8 మందిని క్వారంటైన్‌కు తరలించగా, ఆ ఎనిమిది మందిలో చాహల్, గౌతమ్‌లు కూడా ఉన్నారు. ఇప్పుడూ వీరు కూడా కరోనా బారీన పడడంతో మరోసారి మిగతా అందరు ఆటగాళ్లకు కూడా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
శ్రీలంకతో జరిగిన మూడు ఓడీఐల సిరీస్‌ను గెలుచుకున్న భారత్ టీ20 సిరీస్‌లో మాత్రం గెలవలేకపోయింది. మొదటి టీ20 మ్యాచ్ నెగ్గిన టీమిండియా తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆ సిరీస్‌ను కోల్పోయింది. కాగా ఐపీఎల్ మ్యాచ్ లకు ఇంకా చాలా సమయం ఉండడం వల్ల భారత ఆటగాళ్లంతా ఇంకా కొన్ని రోజులు లంకలోనే ఉండబోతున్నారు.
అయితే ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ రిజల్ట్ వచ్చిన వారిని మాత్రమే స్వదేశానికి పంపించి, పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను మాత్రం లంకలోనే ఉంచనున్నారు. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ మిగతా మ్యాచ్ లు యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ లు మిగిసిన తరువాత అక్కడే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా టీమిండియా సీనియర్ జట్టు ఆగస్టు 4వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.