కరీంనగర్: టీఆర్ఎస్ మాజీ మంత్రి తాజా బీజేపీ నాయకుడు అయిన ఈటల రాజేందర్ ఇవాళ పాదయాత్ర సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. ‘ప్రజా దీవెన యాత్ర’ పేరిట ఆయన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అలుపు లేకుండా పాదయాత్ర కొనసాగిస్తుండడంతో ఆరోగ్యం దెబ్బతింది.
మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఈటల తీవ్ర జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడుతున్నారని చెప్పారు. వైద్యులు పరీక్షలు చేసి ఈటలకు లో బీపీ ఉందని, షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగాయని తెలిపారు. బీపీ 90/60కి పడిపోగా ఆక్సిజన్ లెవల్స్ కూడా పడిపోయాయని, ఈ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఈటలను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు.
కొండపాక వరకూ పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజనం ముగించిన తరువాత ఆయన బాగా నీరసించిపోయారు. కాగా అక్కడ వైద్యులు పరీక్షలు చేశారు. అనారోగ్యం వల్ల పాదయాత్రకు తాత్కాలిక విరామం కలిగింది. అయితే పాదయాత్రను బ్రేక్ లేకుండా ఎండావానకు తడుస్తూ కొనసాగిస్తుండడంతో ఈటల నీరసించిపోయారని ఈటల వర్గీయులు చెబుతున్నారు.
ఈటల రాజేందర్ అనారోగ్యం పాలవదంతో ఆయన బదులు తన సతీమణి జమున పాదయాత్ర కొనసాగించారు. ఈరోజు షెడ్యూల్లోని ఆరు గ్రామాల్లో మూడింటిలో ఈటల జమున పాదయాత్ర కొనసాగించారు. హిమ్మత్‌నగర్‌లో పాదయాత్రను ముగించారు. దీనితో పాదయాత్రకు తాత్కాలిక విరామం పడిందని ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. కోలుకున్న తర్వాత ఈటల తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారని చెప్పారు.
దీనికి సంబందించి తగిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా ఆయనకు జ్వరం బాగా తగ్గితేనే ఈ పాదయాత్రను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బిజేపీలో చేరి రాబోయే ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రజాదీవెన యాత్రను ప్రారంభించి ప్రజలను కలుస్తున్నారు.