హైదరాబాద్: తెలంగాణలో దాదాపు ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో త్వరలో రూ.1,850 కోట్ల వరకు రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు రైతులు చేసిన పంట రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ నుండి రెండు ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రంలో రైతులు చేసిన రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని అలాగే బ్యాంకులు ఈ డబ్బుని ఏ ఇతర బాకీ కింద కూడా జమ చేసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఆ సొమ్మును కేవలం పంట రుణమాఫీ కింద మాత్రమే జమ చేయాలని స్పష్టం చేసింది. అలాగే రుణమాఫీ చేసిన ఖాతాలను జీరో చేసి, వారికి కొత్తగా పంట రుణాలను ఇవ్వాలని సూచించింది.
ఈ అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు.
ఈ రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాలో జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు మెసేజ్ లు కూడా వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని, ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలని ఆయన సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు.