ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్, ప్రపంచ టెక్ దిగ్గజం అయిన గూగుల్ తో కలిసి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ ను తీసుకురానున్న విషయం విదితమే. రిలయన్స్ జియో తమ వినియోగదార్ల కోసం అతి తక్కువ ధరలోనే 4జీ స్మార్ట్ మొబైల్ ను తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యింది.
ఈ ఫోన్ ను కేవలం రూ.4000 అతి తక్కువ ధరకే అందించాలని రిలయన్స్ జియో కంపెనీ తమ ప్రయత్నాల్లో ఉంది. కాగా ఈ స్మార్ట్ మొబైల్ ఈ ఏడు సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చే ప్రణాలికలు చేస్తోంది.
జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) వర్షన్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ హెచ్ డీ+ డిస్ప్లేతో పాటు సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని లాంచ్ సమయంలో ప్రకటించారు. జియోఫోన్ నెక్ట్స్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత తక్కువ ధరలో దొరికే స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని ముఖేష్ అంబాని అన్నారు.
జియోఫోన్ నెక్ట్స్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకువస్తున్నట్లు రెహమాన్ పేర్కొన్నారు. దీనిలో 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇక ధర విషయానికి వస్తే కంపెనీ సబ్ $50(సుమారు రూ.4,000) ధరకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.