న్యూఢిల్లీ: భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. ఒక మహిళతో పాటు ఒక వ్యక్తి బలవన్మరణానికి ప్రయత్నించారు. వారు కిరోసిన్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకుని మంటలతో కోర్టు ఆవరణలోకి ప్రవేశించారు. అందువల్ల ఒక్కసారిగా కోర్టు ఆవరణలో తీవ్ర అలజడి రేగింది. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారి మంటలని ఆర్పి హుటాహుటిన ఆస్పత్రికి పంపారు.
సుప్రీంకోర్టు ముఖ్య ద్వారం గేట్ నంబర్ డీ వద్దకు సోమవారం ఉదయం ఒక మహిళ మరియు ఒక వ్యక్తి లోపలికి వెళ్లేందుకు చూడగా అక్కడి భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఏదైనా ఐడీ కార్డు లేదా, ధ్రువపత్రాలు ఉన్నాయా? అని అడుగగా లేవని చెప్పడంతో సెక్యూరిటీ వారిని కోర్టూ ఆవరణలోనికి రానివ్వలేదు.
దీంతో కలత చెందిన వారు అప్పటికప్పుడు అక్కడే నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. వెంటనే వారిని హుటాహుటిన పోలీస్ వ్యాన్‌లో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు.
కాగా వారి ఇద్దరూ ఎవరు? ఏ కారణంగా వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు? అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బాధితులు తమకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో బలవన్మరణానికి యత్నించారని తెలుస్తోంది.