చండీగఢ్: భారత్ కు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా స్వగ్రామం హరియాణలోని పానిపట్ సమీపంలోని సమల్ఖాకు బయల్దేరాడు. ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరి స్వగ్రామం చేరుకునేలోపు నీరజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుండి కారు టాప్‌పై ఉండడం వల్ల నీరసానికి గురయ్యాడు.
దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్ బాగా నీరసించాడు. అతన్ని వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా నీరజ్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి అస్వస్థత వల్ల నీరజ్ గైర్హాజరయ్యాడు.
పానిపట్‌కు చేరుకున్న తరువాత నీరజ్ చోప్రా నీరసించడం వల్ల వెంటనే అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇటీవల నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో అతనికి నెగటివ్ అని తేలింది. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యం చెందాడు. కొంత విశ్రాంతి ఇస్తే ఈ 23 ఏళ్ల యువకుడు కాస్త త్వరగా కోలుకునే అవకాశం ఉంది.