టాలీవుడ్: యూ ట్యూబ్ వీడియోలతో జర్నీ మొదలుపెట్టి సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ పోయిన సంవత్సరం విడుదలైన ‘కలర్ ఫోటో’ తో హీరో గా అద్భుతమైన హిట్ సాధించి ప్రస్తుతం హీరో గా దాదాపు 5 నుండి 6 సినిమాల్లో నటిస్తూ సక్సెస్ కి హార్డ్ వర్క్ కి చిరునామాగా మారిన సుహాస్ ఈ రోజు తన తదుపరి సినిమా అప్ డేట్ ఇచ్చారు. సుహాస్ నటిస్తున్న సినిమాల్లో ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా ఒకటి. తాను యూ ట్యూబర్ గా వర్క్ చేసిన ‘చాయ్ బిస్కెట్’ వారు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి మొదటి సినిమాని సుహాస్ హీరో గా రూపొందిస్తున్నారు. ఈ రోజు సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేసి రిలీజ్ అప్ డేట్ ఇచ్చారు.
ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో పద్మభూషణ్ పాత్రలో ఉన్న సుహాస్ ఫామిలీ తో సహా కనిపించాడు. ఫామిలీ తో సహా విజయదశమి కి రాబోతున్నట్టు సినిమా రిలీజ్ దసరా అన్నట్టు ప్రకటించేసారు. ఈ సినిమాలో సుహాస్ తల్లి తండ్రులుగా ఆశిష్ విద్యార్ధి మరియు సీనియర్ నటి రోహిణి నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆశిష్ విద్యార్ధి తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సుహాస్ ‘ఫామిలీ డ్రామా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సైకో కిల్లర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లో కూడా సుహాస్ నటనకి మంచి పేరొచ్చింది. కెరీర్ ఆరంభం లోనే తెలుగులో ఏ హీరో చేయలేని డేరింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుహాస్. దాదాపు 6 సినిమాల్లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్న సుహాస్ తెలుగు సినిమా గర్వించే నటుడు అవ్వాలని ఆశిద్దాం.