అమరావతి: ఏపీ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ 44 ఏళ్లు దాటిన వారందరికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక పై 18 నుండి 44 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో ఇప్పటి దాకా హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, గర్భిణులు, టీచర్లు మరియు 44 ఏళ్ల వయసు దాటిన వారందరికీ మొదటి డోసు వ్యాక్సినేషన్ దాదాపు 96 శాతం పూర్తయింది. వీరిలో ఇప్పుడు చాలామందికి రెండవ డోసు కూడా కొనసాగుతోంది. కాగా 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 18 ఏళ్ల వయసు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అయితే వ్యాక్సినేషన్ సమయంలో రద్దీని తగ్గించడానికి గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్లు ఇస్తారు. సదరు ప్రాంతానికి చెందిన ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు అర్హులను గుర్తించి ఆయా కేంద్రాలకు తరలిస్తారు.
అయితే 18 – 44 ఏళ్ల వయసు వారు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నట్లు ప్రాథమిక అంచనా. కొత్తగా వీరికి టీకాలు వేస్తూనే ఇంకోవైపు ఇతర కేటగిరీల వారికి రెండవ డోసు టికాను కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో దాదాపు 2.64 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పంపిణీ జరిగింది. వీరిలో అత్యధికంగా 45 – 60 ఏళ్ల వయసు వారున్నారు. రాష్ట్రంలో పురుషులకంటే ఎక్కువగా మహిళలకే టీకాలు ఇచ్చారు.