టాలీవుడ్: కొన్ని సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫామిలీ హీరో గా ఎదిగి గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు జగపతి బాబు. అప్పటి నుండి జగ్గూ భాయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలన్ పాత్రలు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మెప్పిస్తున్నాడు. అరవింద సమేత వీర రాఘవ, రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాల ద్వారా అద్భుతమైన క్యారెక్టర్లలో నటించాడు. ప్రస్తుతం అలాంటి మరో భీకరమైన విలన్ కారెక్టర్ లో రానున్నాడు జగ్గు భాయ్.
ప్రభాస్ హీరో గా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సాలార్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందుతున్న ఈ సినిమా 2022 కి సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకి సంబందించిన క్యారెక్టర్ లుక్ ఈ రోజు విడుదల చేసారు. రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు లుక్ భీకరంగా ఉందని చెప్పచు. మాసిన గడ్డం తో నోట్లో సిగార్ పెట్టుకుని ముక్కుకి ముక్కెర ధరించి మాస్ మరియు క్రూరమైన విలన్ గా కనిపిస్తున్నాడు.
కేజీఎఫ్ సినిమాని రూపొందించిన హోంబేలె ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు క్యారెక్టర్లు చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా గనుల నేపథ్యంలో రూపొందనుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.