కరీంనగర్: తెలంగాణలో త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలన్నీ పట్టు బిగిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీ మరియు టీఆర్‌ఎస్ మధ్య నువ్వానేనా అన్న స్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మధ్యనే శాలపల్లిలో జరిగిన సీఎం సభతో గులాబీ నేతల్లో జోష్ రాగా, కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు కూడా తమ యాత్రలు మొదలు పెట్టారు.
ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉండటంతో ఒక ధీటైన స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ ఆలోచనలో ఉందని సమాచారం. హుజూరాబాద్ లో జరిగే ఉప ఎన్నిక టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎవరూ తగ్గకుండా పట్టుబిగించాలని అన్ని అధిష్టానాలు గట్టి సూచనలు చేస్తున్నారు.
కాగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకు కూడా స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి బలమైన నాయకులను బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన బలమైన నేత, మాజీమంత్రి కొండా పేరును ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు ప్రతిపాదించారు.
కాగా ఈ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్‌కు భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉండటంతో కొండా సురేఖ సైతం తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిస్తోంది. అయితే, ఇక్కడ పోటీ చేయాలంటే ఆమె కొన్ని షరతులు విధించారని సమాచారం. 2023 ఎన్నికల సందర్భంగా తనకు ఉన్న డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తే పోటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న కొండా వర్గీయుల ప్రతిపాదనకు అధిష్టానం కూడా అంగీకరించిందని సమాచారం.