టాలీవుడ్: కరోనా టైం లో ఓటీటీ లకి ఆదరణ బాగా పెరిగిపోయింది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు మాత్రమే కాకుండా థియేటర్లో రిలీజైన సినిమాలు కూడా చాలా తొందరగా ఓటీటీ ల్లో విడుదలవుతున్నాయి. చివరి సంవత్సరం ‘గాలి సంపత్’ అనే సినిమా విడుదలైన పది రోజుల్లోనే ఓటీటీ లో విడుదలైంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన ఒక చిన్న సినిమా రెండు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షమైంది.
హుషారు సినిమాలో మెప్పించిన దినేష్ హీరో గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ సినిమా ఆగష్టు 6 న థియేటర్లలో విడుదలైంది. ఆగష్టు 19 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదలైంది. ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా క్లీన్ సినిమాగా రూపొందించినప్పటికీ పెద్దగా ఆదరణ నోచుకోలేదు. విడుదలైన వారం రోజులకే థియేటర్లలోంచి తీసేసారు.
ఒక రకంగా ఓటీటీ రిలీజ్ లు ప్రేక్షకుడి ఇంటికే సినిమాని తీసుకొస్తున్నాయి అన్న ఆనందం ఒకటి ఉన్నా కూడా ఇలాంటివి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో థియేటర్లలో సినిమాని చూడడానికి ప్రేక్షకుడు వెనకాడుతాడు ఏమో అన్న సందేహం కూడా మొదలవుతుంది. ఒక నిజమైన సినిమాటిక్ అనుభూతి కావాలంటే సినిమాల్ని థియేటర్లలోనే చూడాలి. కానీ పరిస్థితులు చూస్తుంటే అది మున్ముందు రోజుల్లో కష్టమేమో. పెద్ద సినిమాలకి అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఎటొచ్చి థియేటర్లలో చిన్న సినిమాల పరిస్థితి కష్టం అవచ్చు.