న్యూఢిల్లీ: దేశంలో పని చేస్తున్న అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక మరియు ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేడు ఈ-శ్రమ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభం చేశారు. ఈ ఈ-శ్రం పోర్టల్ ద్వారా దేశంలో ఉన్న అసంఘటిత రంగం కార్మికుల వివరాలను సేకరిస్తారు.
దేశ కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి ఇది సహకరిస్తుంది. ఆధార్ కార్డు ఆధారంగా కార్మికులు తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆయా కేటగిరిల కింద అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సదరు కార్మికులకు అందించే వీలు కలగుతుంది.
దేశంలో తొలిసారిగా 38 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వివరాలను నమోదు చేయడానికి నూతన వ్యవస్థ తయారు చేయబడుతోంది. ఇందులో వివరాలు నమోదు చేయడం ద్వారా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సామాజిక భద్రతా పథకాలను పొందడానికి సహాయంగా ఉంటుంది” అని కార్మిక మంత్రి అన్నారు.
కాగా ఇందులో పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు రూ.2.0 లక్షల వరకు ప్రమాద భీమా లభిస్తుంది. నమోదు చేసుకున్న కార్మికులు ఏదైనా ప్రమాదానికి లోనై మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం చెందితే రూ.2.0 లక్షలు, పాక్షిక వైకల్యం చెందితే రూ.1.0 లక్షలకు అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కొరకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది అని తెలిపారు.
ఈ పోర్టల్‌లో పుట్టిన తేదీ, స్వస్థలం, మొబైల్ నంబర్ వంటి ఇతర అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. అలాగే, కార్మికుడు తన ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నమోదు చేశాక కార్మికునికి ఈ-శ్రమ్ కార్డు జెనరేట్ అవుతుంది. దాన్ని వారు భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే.. నివృత్తి చేసుకునేందుకు జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 14434ని కూడా ప్రారంభించారు.