హైదరాబాద్: హైదరాబాద్ లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తమ వినియోగదార్లకు శుభవార్తను తెలిపింది. తమ వినియోగదారులు ఇంటి వద్దనే కాక బయటకు వెళ్లినప్పుడు కూడా ఇంటర్నెట్ సేవలను ఉచితంగా మరియు అపరిమితంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. అందు కోసం హైదరాబాడ్ నగరంలోని నలుమూలల ఫ్రీ వైఫై జోన్లను ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, యాక్ట్ సంస్థలు ముగ్గురు కలిసి సంయుక్తంగా ఈ హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. దీనిలో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది.
యాక్ట్ స్మార్ట్ పైబర్ టెక్నాలజీ సాయంతో యాక్ట్ సంస్థ తన వినియోగదారులకు ఇంటినుండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది. తమ వినియోగదారులు ఇళ్లు లేదా ఆఫీస్ దగ్గర ఉన్న వారి ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్లాన్‌లో ఐతే ఉందో, అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా వారు నెట్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
దీని వల్ల ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందితే, యాక్ట్ తమ యూజర్లకు ఇంటి దగ్గర వినియోగిస్తున్న ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వీలు కలిపిస్తోంది. అదే విధంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.