న్యూఢిల్లీ: హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అడ్డంకులు తొలిగాయి. ఈ ఏడాది ఏర్పాటు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఇవాళ సుప్రీంకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఇదే చివరి అవకాశం అని సూప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా ఇంతకుముందు హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సూప్రీం కోర్టులో తమ వాదనలు వినిపించారు.
రాష్ట్రంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే హైకోర్టు ఈ ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. కాగా ఈ విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో చాలా ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. కాబట్టి రేపు ఏడాది నుండి ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు.
ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్ల ఏర్పాటు కూడా చేశామని హుస్సేన్ సాగర్ లో ఎటువంటి కాలుష్యం జరగకుండా వెను వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు తనకు తెలుసు అని సీఐజే తెలిపారు.
హుస్సేన్ సాగర్ పరిశుభ్రపరిచేందుకు, సుందరీకరణకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే ఇలా ప్రతి ఏడాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల ఈ నిధులు అన్నీ వృథా అవ్వడం లేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తాము 22 చిన్న పాండ్స్ ను ఏర్పాటు చేశామని, అయితే అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.