దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ 2021 సీజన్ లో ఇప్పటికే వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా నిష్క్రమిచే తరుణంలో ఆ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లో ఉన్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో స్థానంలో ఇటీవలే జట్టులోకి వచ్చిన విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ తండ్రి మరణించడంతో స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు.
2021 ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బే తగిలిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో దశ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్‌కు దూరమయ్యారు.
ఆ జట్టు స్టార్ బౌలర్ అయిన నటరాజన్ కరోనా బారిన పడడంతో జట్టుకు దూరం కాగా, అతనితో అత్యంత సన్నిహితంగా ఉన్న విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి మరణంతో రూథర్‌ఫర్డ్ కూడా లీగ్‌కు దూరం అవడంతో ఈ ముగ్గురి స్థానంలో ఎవరు ఆడతారోనని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.
రెండో దశలో మొదటి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగా, ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు మాత్రమే నష్టపోయి మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.