దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంది. క్రితం మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసిన ఆర్‌సీబీ నిన్న మరొక సమష్టి ప్రదర్శనతో కీలక విజయాన్ని నమోదు చేసుకుంది. బౌలింగ్ విభాగంలో చహల్, షహబాజ్ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్, ఎస్ భరత్ రాణించడంతో రాజస్తాన్‌పై అలవోక గెలిచింది.
రాజస్థాన్ ఓపెనర్లకు శుభారంభం లభించినా మిగతా వారు దానిని కొనసాగించలేక పోవడంతో తక్కువ స్కోరు మాత్రమే చేయగలిగింది. రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. లూయిస్ (37 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, యశస్వి జైస్వాల్ (22 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ (2/18), హర్షల్ పటేల్ (3/34), షహబాజ్ (2/10) ఆకట్టుకున్నారు.
తరువాత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (30 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (35 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఛేజింగ్‌లో మోరిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి కోహ్లి (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఛేదనను జోరుగా మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో కూడా వేగంగా ఆడిన పడిక్కల్ (17 బంతుల్లో 22; 4 ఫోర్లు) ను ముస్తఫిజుర్ అవుట్ చేసి భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కోహ్లి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
ఈ దశలో ఆంధ్ర క్రికెటర్ భరత్, మ్యాక్స్‌వెల్ కలిపి ఇన్నింగ్స్‌ను వేగంగా పరిగెత్తించారు. వీరిద్దరు మూడో వికెట్ కు 55 బంతుల్లో 69 పరుగులు జోడించిన తరువాత భరత్ అవుటయ్యాడు. ఈ సమయానికి బెంగళూరుకు గెలుపుకు 24 బంతుల్లో 23 పరుగులు కావాల్సి ఉండగా అక్కడి నుండి మరో 7 బంతు ల్లోనే ఆట ముగిసింది! మోరిస్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్స్ వెల్ (6, 2, 4, 2, 4, 4) 22 పరుగులు రాబట్టగా… పరాగ్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతిని డివిలియర్స్ (4 నాటౌట్) ఫోర్ బాది విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు.