మస్కట్: అద్భుత ప్రదర్శన చేసిన స్కాట్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’లో ఓడించింది. బంగ్లాదేశ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి స్కాట్లాండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మెహిదీ హసన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ముషి్ఫకర్ రహీమ్ (36 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు.
కీలకమైన షకీబ్, ముషి్ఫకర్ వికెట్లను గ్రీవ్స్ పడగొట్టగా, మరో బౌలర్ బ్రాడ్ వీల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఇది కేవలం రెండో టి20 మ్యాచ్‌కాగా రెండింటిలోనూ స్కాట్లాండే నెగ్గడం విశేషం. 2012లో ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్కాట్లాండ్‌పై అతను 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా శ్రీలంక పేసర్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును అధిగమించి 108 వికెట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు.