న్యూయార్క్: కరోనా మహమ్మరి వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో విస్తరించిన వర్క్ ఫ్రం హోం ఇంకా కొనసాగుతోంది. కాగా ఇదే కోవలో గూగుల్ సంస్థ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పద్ధతి అవలంబిస్తోంది. కాగా తాజాగా ఈ పని విధానం విషయంలో కొత్త విధానం అమలు చేయాలని గూగుల్ నిర్ణయించింది.
ఈ నూతన పద్ధతి ప్రకారం ఎంప్లాయిస్ ఇకపై పూర్తిగా వర్క్‌ఫ్రం హోం కాకుండా అలాగని పూర్తిగా రెగ్యులర్ పద్దతిలో ఆఫీసులకు రాకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ మెథడ్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొదటగా ఈ నూతన విధానాన్ని అమెరికాలో అమలు చేసి ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించబోతున్నారు.
యూఎస్ లో ప్రస్తుతానికి ఐదు రోజుల పని విధానం అమలవుతోంది. ఈ విధానంలో ఉద్యోగులు వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఇకపై ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఇళ్ల నుంచి పని చేస్తే ఇక మిగతా రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఈ వర్క్ విధానాన్ని టూ బై త్రీ (2/3) మోడల్‌గా పేర్కొన్నారు.
గత సంవత్సర కాలంగా తమ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేయడానికి అలవాటు పడ్డారు, దీంతో చాలా మంది నగరాలకు దూరంగా రిమోట్ ఏరియాల్లో నుండి పని చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా వారందరినీ ఆఫీసులకు రావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అందువల్ల దీన్ని దూరం చేసేందుకు టూ బై త్రీ మోడల్‌ని అమలు చేయాలని నిర్ణయించాం’ అని పిచాయ్ తెలిపారు.