న్యూఢిల్లీ: భారత్ లో ఇప్పుడిప్పుడే విద్యుత్ వాహనాల అమ్మకాలు క్రమంగ్ ఊపందుకుంటున్నాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విద్యుత్ ద్విచక్ర వాహనాలు మరియు కార్ల అమ్మకాలు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం అదే సమయంలో ఈవీ వాహన ధరలు తగ్గడంతో అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం అయిన ఏప్రిల్ 2021 – సెప్టెంబర్ 2021 మధ్య దేశంలో మొత్తం 6,261 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి సదరు కార్ కంపెనీలు. కాగా విద్యుత్ కార్ల అమ్మకాల్లో ఇది ఒక సరికొత్త రికార్డు. పోయిన సంవత్సరం ఇదే కాలంలో 1,872 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. కాగా ఈ సారి 234 శాతం పైగా అమ్మకాలు పెరిగాయి.
కాగా ఈ విద్యుత్ కార్ల అమ్మకాల్లో అత్యధికంగా టాటా నెక్సన్ ఈవీ కార్లు ఉండడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 3,618 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు ఏకంగా 214 శాతం అధికంగా నమోదయ్యాయి. మొత్తం అమ్మకాల్లో అమ్మకాల పరంగా ఏంజీ జెడ్ఎస్ ఈవీ రెండో స్థానాన్ని పొందింది.
హెచ్1 ఎఫ్ వై21-22లో 1,789 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 250 శాతం అధికం. 801 యూనిట్ల అమ్మకాలతో టాటా టిగోర్ ఈవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు 701 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ కోనా అమ్మకాల పరంగా నాల్గవ స్థానాన్ని కలిగి ఉంది.
మహీంద్రా నుండి అతి త్వరలో ఈకెయువీ100ని లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. టాటా నుండి కూడా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల అవనున్నాయి. ఈ వరుసలో ఆల్ట్రోజ్ ఈవీ, పంచ్ ఈవీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎంజీ మోటార్ ఇండియా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటన చేసింది. హ్యుందాయ్, కియా కూడా కొన్ని ఈవీలను ప్రారంభించాలన్నా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.