న్యూఢిల్లీ: భారత దేశంలో వివిధ రంగాల్లో ఎనలేని సేవలు అందించిన వారికి ప్రతి ఏటా పద్మ పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీ. ఇటీవలే ప్రకటించిన ఈ పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 పురస్కారాలను ఆయన అందజేశారు.
ఈ వేడుకలో ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఇందులో మొత్తం 33 మంది మహిళలున్నారు. కాగా ఈ పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మరియు తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. భారత్ యొక్క ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు.
ఇక శ్రీకాకుళం జిల్లా లోని మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు, అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దాళవాయి చలపతిరావు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.