న్యూఢిల్లీ: ఎస్బీఐ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. తమ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అన్ని ఈఎంఐ లావాదేవీలకు ఇక పై ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నుకు లోబడి ఉంటాయని ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డులు & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌బీఐసీపీఎస్ఎల్) ఇటీవల రూ.99 ప్రాసెసింగ్ ఫీజువసూలు చేసి దానిపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించింది.
ఎస్బీఐ తమ ఈ నూతన నిబంధన డిసెంబర్ 1వ తేదీ 2021 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రిటైల్ లొకేషన్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్స్ నిర్వహించే అన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) కొనుగోళ్లకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది అని బ్యాంక్ తెలిపింది.
తమ వినియోగదారులకు ఈ విషయం గురించి తెలియజేస్తూ ఒక ఈ-మెయిల్ ను పంపింది. “01 డిసెంబర్ 2021 నుంచి మర్చంట్ అవుట్ లెట్/వెబ్ సైట్/యాప్ వద్ద చేసిన అన్ని మర్చంట్ ఈఎమ్ఐ లావాదేవీలపై రూ.99 (+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్లు మేము మీకు తెలియజేస్తున్నాము” అని ఎస్‌బీఐ సీపీఎస్ఎల్ తెలిపింది.
ఈ నోటీసును ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులందరికీ పంపారు. అంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో వస్తువులను కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది. అలాగే, ఈఎమ్ఐ లావాదేవీ విఫలమైనా లేదా క్యాన్సిల్ చేసిన ప్రాసెసింగ్ ఖర్చు తిరిగి చెల్లిస్తారని తెలిపింది.