కోల్కతా: న్యూజిలాండ్ తో జరిగిన 3వ టీ20 మ్యాచ్ నామమాత్రమే అయినా టీమిండియా నిర్లక్ష్యం వహించకుండా చెలరేగింది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలండ్ పై ఏకంగా 73 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ శర్మ బృందం 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులను చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో కేవలం 31 బంతుల్లోనే 56 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లతో మెరిశాడు.
ఆఖర్లో దీపక్ చహర్ 8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్ లతో ధనాధన్ ఆటతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా అందరూ విఫలమయ్యారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని కట్టుదిట్టమైన బౌలింగ్ తో దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌథీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25న కాన్పూర్‌లో మొదలవుతుంది.
కాగా భారత్ కు న్యూజిలాండ్‌పై ఇది మూడో టి20 సిరీస్ విజయం కావడం విశేషం. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఆరు టి20 సిరీస్‌లు జరగగా మరో మూడింటిలో న్యూజిలాండ్ గెలిచింది. స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన మొత్తం టి20 మ్యాచ్‌ల సంఖ్య 11.