న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. ఈ నెల 16, 17వ తేదీలలో మీరు బ్యాంకుకు వెళ్ళాలని అనుకుంటున్నారా ? అయితే ఒక్క నిమిషం! ఈ రెండు తేదీలలో బ్యాంకులు సమ్మెను పాటిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్త!
దేశంలోని రెండు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రెండు రోజుల పాటు సమ్మెను చేస్తున్నాయి. ఈ సమ్మె వల్ల ఆయా బ్యాంకుల కార్యాకలాపాలు ఈ రెండు రోజులు అందుబాటులో ఉండవు. కాగా ఈ సమ్మెలో దాదాపుగా తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్టొననున్నట్లు సమాచారం.
ఇప్పటికే చాలా వరకు బ్యాంకులు తమ ఖాతాదారులను ఈ సమ్మె విషయమై వారిని అప్రమత్తం కూడా చేశాయి. చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి బ్యాంకు లావాదేవీలపై ఈ సమ్మె ప్రభావం చూపుతుంది. కాగా బ్యాంకులు తలపెట్టిన ఈ రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ సంఘాలతో ఆయా బ్యాంకులు తమ సమ్మెను విరమించుకోవలసిందిగా తమ ఉద్యోగులను కోరాయి.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అందువల్ల సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వగా, వారి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రేవేటీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు నిరసనగా డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో ఆర్థిక రంగంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని స్వయంసహాయక సంఘాల రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.