వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో ఒక అరుదైన మైలురాయిని సాధించింది. ఈ మధ్య కాలంలో ఎన్ఐటీ వరంగల్ రీసెర్చ్ అవుట్‌పుట్‌లో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. స్కోపస్ డేటాబేస్ ప్రకారం, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2021లో ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు మరియు విద్యార్థుల రీసర్చ్ ప్రచురణల సంఖ్య 1000కు చేరింది. అయితే 2017లో మొత్తం ప్రచురణల సంఖ్య 540 ఉంది.
కాగా గడచిన 4 సంవత్సరాలలో రీసెర్చ్ అవుట్‌పుట్‌లో దాదాపు రెండింతలు పెరుగుదల నమోదు చేసింది. 2018, 2019లో గత రెండు రిక్రూట్మెంట్లలో ఈ యూనివర్సిటీలో దాదాపు 150 మంది కొత్త ఫ్యాకల్టీలను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్.వి.రమణారావు, డైరెక్టర్, రిజిస్ట్రార్ శ్రీ. ఎస్ గోవర్ధన్ రావు, డీన్లు, సలహాదారులు మొత్తం ఎన్ఐటీ వరంగల్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.
భారత దేశంలో తాజాగా విడుదల చేసిన నూతన జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా ఇన్స్టిట్యూట్ లో అన్ని కోర్సుల పాఠ్యాంశాలను పూర్తిగా సవరించామని, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ స్కాలర్లను తీసుకోవడం 150 నుంచి 250కి పెంచామని కూడా ప్రొఫెసర్ రమణారావు తెలిపారు. సైన్సెస్‌లో మరిన్ని కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టామని, మెరుగైన శక్తి, ఉత్సాహంతో ఇన్స్టిట్యూట్ మరిన్ని మైలురాళ్లను సాధించి ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.