అమరావతి: ఏపీ లో మళ్ళీ నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రాత్రి 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. అలాగే సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని, మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ వేగంగా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న విషయాన్ని సీఎంకు అధికారులు వివరించారు. కోవిడ్ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు వివరించారు.
కోవిడ్‌లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు కూడా చేయాలని తెలిపారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.