మూవీడెస్క్: టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ స్థాపించిన తెలుగులోని ఏకైక ఓటీటీ యాప్ ఆహా అని అందరికీ తెలిసిందే. లేటెస్ట్ సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లతో పాటు సరికొత్త రియాలిటీ షోలతో ఆహా డిజిటల్ రంగంలో టాప్ స్పీడ్ లో దూసుకెళ్తోంది.
అయితే ఈ నేపథ్యంలో ఆహాను స్థాపించిన కొద్ది సమయంలోనే అగ్ర ఓటీటీ సంస్థగా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆహా సబ్‌స్రైబర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుదల నమోదు చేస్తోంది. అయితే తాజాగా ఆహా యాప్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు అల్లు వారసుడైన హీరో అల్లు శిరీష్.
ఇప్పుడు తను చేసిన ట్వీట్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆహా సబ్స్రైబర్లు యాప్‌లో తమకు ఏమైన సమస్యలు తలెత్తితే వాటిని ట్వీటర్ వేదికగా లేవనెత్తుతున్నారు. యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను చెబుతూ దీనిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్ టీంతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేస్తున్నారు.
కాబట్టి చాలా మంది ఆహాలో తమకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సోషల్ మీడియాలో వీరిని ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ దీనిపై స్పందించాడు. ఆహాని ట్యాగ్ చేస్తూ చాలామంది నేను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యాను అని అనుకుంటున్నారు. దయచేసి ఆహా టీం ఈ కంప్లైంట్స్‌ని చూడండి అంటూ ట్వీట్ చేశాడు.
శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు అందరూ షాక్‌కు గురై ‘ఏంటి శిరీష్‌కు ఆహాకి సంబంధం లేదా’ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆహాలో అల్లు అరవింద్ మాత్రమే కాక మరికొంతమంది కూడా పార్ట్నర్లుగా ఉన్నారు. ఐకాన్ స్టార్, అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్ దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆహాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఆహా చేసే ప్రతి ఈవెంట్లోనూ అల్లు అర్జున్ పాలు పంచుకుంటున్నాడు. దానితో పాటు అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ కూడా ఆహాకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్నాడు. ఇలా అల్లు వారి వారసులు ఆహాలో ఏదో ఒక విధంగా భాగంగా ఉన్నారు. అయితే ఇంతవరకు అల్లు శిరీష్ మాత్రం ఆహాలోని ఏ ఈవెంట్లో కనిపించకపోవడం గమనార్హం.