పనాజి: 2024 సంవత్సరంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టు సాధించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించింది. కాగా ఇప్పుడు అదే ఊపులో గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. గోవా ఆప్ సీఎం అభ్యర్థిగా లాయర్ అమిత్ పాలేకర్ పేరును ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పనాజిలో జరగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఆప్ పోటీ చేస్తుందని వెల్లడించారు. గోవా ప్రజలు తమ పార్టికి పట్టం కడతారని తనకు నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా క్రితం ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. కానీ ఈ సారి ఆప్ గోవాలో అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్‌లో రాష్ట్రాన్ని వేగంగా అభిృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.