ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా అందరిని కలిచి వేసింది. నెల రోజులైనా కూడా ఇంకా ఆ పేరు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. సుశాంత్ చనిపోయేముందు బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి (తూనీగ తూనీగ ఫేమ్) తో ఎక్కువ కాలం గడిపారు. వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా చాలా రూమర్స్ వినిపించాయి. సుశాంత్ అంత్య క్రియలకి వచ్చిన రియా నెల రోజుల తర్వాత సుశాంత్ గురించి ఒక ఆత్మీయ లేఖ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
”నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నా మనసులో పూడ్చలేని శూన్యం నిండింది. నాకు నువ్వు నిజమైన ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు దాని విలువ తెలియచేసావు. ఓ చిన్న మ్యాథమేటికల్ ఈక్వెషన్ ద్వారా మన జీవితాన్ని అర్థం చేసుకునే విధానాన్ని నువ్వే నాకు నేర్పావు. నేను నీ దగ్గర రోజు నేర్చుకుంటా అని ప్రామిస్ చేశా. నువ్వు లేని లోటును నేను మాటల్లో వివరించలేను. ప్రస్తుతం నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నావని భావిస్తున్నాను. చంద్రుడు నక్షత్రాలు గెలాక్సీ ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్తకు సాదరంగా స్వాగతం పలికి ఉంటాయి. నిన్ను మళ్లీ నా దగ్గరకు పంపాలని కోరుకుంటాను. నీ వ్యక్తిత్వం ఎంతో అందమైనది. నీ మార్గంలో అద్భుతమైన ప్రపంచం చూసావు. మన మధ్య ప్రేమను తెలిపేందుకు నాకు మాటలు చాలడం లేదు. ఎన్నోసార్లు నువ్వు మన ప్రేమను గుర్తు చేసావు.
ప్రశాంతంగా ఉండు సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది.
జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను”
ప్రస్తుతం సుశాంత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా ఈ నెల 24 న ఓటీటీ లో విడుదలకి సిద్ధం గా ఉంది. ఇప్పటికి విడుదల అయిన ట్రైలర్, పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని సబ్స్క్రిప్షన్ తో సంబంధం లేకుండా అందరికీ జులై 24 నుండి disney+hotstar డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంచుతున్నట్టు ఇదివరకే అధికారిక ప్రకటన విడుదల అయింది.