న్యూఢిల్లీ: భారత దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన హీరో ఎలక్ట్రిక్ దేశీయ వినియోగదారుల కోసం తాజాగ ఒక కొత్త మోడల్ ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఈ మోడల్ స్కూటర్‌ను తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ఈ ఎడ్డీ స్కూటర్‌లో ఫైండ్ మై బైక్, ఈ-లాక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్లో, లైట్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.
అయితే, ఈ విద్యుత్ ఆధారిత స్కూటర్ ను నడపడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. అలాగే ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని సంస్థ చెబుతోంది. అలాగే ఈ స్కూటర్ యొక్క ధర సుమారు రూ.72,000గా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
త్వరలో రాబోయే ఈ స్కూటర్ గురించి హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ మాట్లాడుతూ, “స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ కలిగిన అద్భుతమైన ప్రొడక్ట్ హీరో ఎడ్డీని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం” అని అన్నారు. ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.