హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల పై వస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. వచ్చే అసేంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకా సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ఎల్పీలో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. పంజాబ్ తరహాలో కేంద్రం, తెలంగాణ వరి ధాన్యం 100 శాతం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీలో చర్చించామని ఆయన మీడియాకు తెలిపారు.
టీఆర్‌ఎస్ చేపట్టే రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశం మొత్తం ఒకటే పాలసీ అమలు చేయాలని రాష్ట్రాన్ని బట్టి ఆ విధానాలు మారకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా తాము తెలంగాణ ఉద్యమం చేసిన తరహాలోనే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని సీఎం తెలిపారు. రేపు గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీల్లో తీర్మానం చేసి ప్రధానమంత్రికి ఆ తీర్మానాన్ని పంపిస్తామని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన యూపీఏ కంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ దుర్మార్గమైన పాలన చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.