అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉర్దూను తన రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రతిపాదించారు.
కాగా ఈ బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ, ఉర్దూ అనేది ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన సభలో చెప్పారు.
రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఉర్దూకు అరుదైన గౌవరం లభించినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికారిక భాషగా కొనసాగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది.