హైదరాబాద్: ప్రపంచాన్ని వణికుస్తున్న కరోనా వైరస్ బారి నుండి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు వాడాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వం అన్ని రకాల అండగా నిలుస్తుందన్నారు. కరోనా బరిన పడి హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రభుత్వం ఉచిత కరోనా వ్యాధి నిర్ధారణ (ర్యాపిడ్ యంటిజెన్ టెస్ట్ కిట్) మరియు హోం ఐసోలేషన్ కిట్లను ఆయన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ చేశారు.
ఆయన ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అయితే ప్రజలను అత్యవసరాల కోసమే బయటకు రావాలని, ఎక్కువగా జనం గుమికూడదని, అనవసరంగా వచ్చి వైరస్ బారిన పడవద్దని ఆయన హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని ప్రభుత్వం వారి కోసం మందులు, ఇంకా హొం ఐసోలేషన్ కు కావలసిన వస్తువలను హొం ఐసోలేషను కిట్ల ద్వారా అందుబాటులోకి తెచ్చిందన్నారు.
హోం ఐసోలేషన్ లో ఉన్నవారి పరిస్తితి ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, టెలిమెడిసిన్ ద్వారా వారికి అవసరమైన మందుల వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తెలియజేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 85శాతం నిర్ధారన అవుతున్న కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారని, వీరు హోంఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉన్నాయని, దీంతో పాటు హోంఐసొలేషన్ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్, కాల్ సెంటర్ నంబర్లు, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబైల్ నంబర్లను పొందుపరచడం జరిగిందన్నారు. ఈ సమగ్ర సమాచారంతో ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.