ముంబై: ఐపీఎల్ 2022 లో కోల్‌కతా తొలి బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా చెన్నై పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చెన్నై మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసి ఫాంలో కి వచ్చాడు. చేజింగ్ లో కోల్‌కతా కేవలం 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రాబిన్ ఉతప్ప (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో జోరు ప్రదర్శించాడు, అయితే కేవలం మూడు పరుగుల వ్యవధిలో ఉతప్ప, రాయుడు (15) వెనుదిరిగారు. జాక్సన్ అద్భుత స్టంపింగ్‌తో ఉతప్ప అవుట్ కాగా, లేని పరుగు కోసం ముందుకొచ్చిన రాయుడు అవుటయ్యాడు. చివర్లో ధోని, జడేజా జంట 55 బంతుల్లో 70 పరుగులు జోడించడంతో చెన్నై ఆ స్కోరు సాధించింది.
ఛేదనలో కోల్‌కతాకు రహానే మంచి ఆరంభ అందించాడు. వెంకటేశ్ అయ్యర్ (16), నితీశ్ రాణా (21) తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 76 పరుగులకు చేరింది. జడేజా చక్కటి క్యాచ్‌తో రహానే ఇన్నింగ్స్ ముగియగా, తర్వాత వచ్చిన స్యామ్ బిల్లింగ్స్ (25) ధాటిగా ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) చివరి వరకు నిలబడి మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఆట ముగించాడు.