హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లో ముఖ్యమంత్రి తో పాటు ఆయన సతీమణి కూడా వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లోని యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీలో టీఆర్‌ఎస్ ధర్నాను తలపెట్టింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాడిన ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల ముఖ్య నాయకులను ఈ ధర్నాకు ఆహ్వానం అందించాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
ఈ ధర్నా కు రాకేశ్ టికాయత్‌తో పాటు ఇతర ముఖ్య రైతు సంఘాల నాయకులతో కూడా ఆయన ఈ పర్యటనలో భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతు న్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉన్నారు.
కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి పార్లమెంట్‌లో నిరసనలు ఉధృతంగా చేపట్టాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలిసింది. సోమవారం నుంచి టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు.