అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరోసారి కాలయాపనకు తెర తీసినట్లు తెలుస్తోంది. వైసీపీ 2019 ఎన్నికల హామీ అయిన సీపీఎస్ రద్దుపై మరో సారి ఐదుగురు సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నూతన కమిటీలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల విభాగం) సజ్జల రామకృష్ణారెడ్డిని సభ్యులుగా చేర్చారు.
ఈ నూతన కమిటీ సభ్యులు మరో సారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీపీఎస్ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.