న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ జాతీయ పార్టీ అధిష్టానం అందించిన ఆఫర్‌ను ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడం లేదు అనే విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇవాళ ధ్రువీకరించారు. కాగా పీకే నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ఆయన తెలిపారు. కాగా గత కొద్దిరోజులుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో భేటీ అవ్వడంతో కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమైనట్లేనని అందరూ భావించారు. అంతేగాక కాంగ్రెస్‌లో చేరి బాధ్యతలు చేపట్టాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వనించారు. ఈ మేరకు పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సోనియా ప్రతిపాదనను నిర్ధ్వందంగా తిరస్కరించారు.