మూవీడెస్క్: ఆచార్య, తెలుగు మల్టీస్టారర్ మూవీ. తెలుగు ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇవాళ రిలీజయ్యింది. మొదటిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన చిత్రం ఇది. అందుకోసమే యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ కోసం చాలా ఆతృతగా ఎదురుచూశారు.
కాగా ఇప్పటికే కరోనా కారణంగా చాలాసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ రివ్యూ మీ కోసం.
చిత్ర నేపథ్యం: ధర్మస్థలి! 800 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్. ఆ పట్టణానికి పక్కనే జీవధార నది ఉంది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ, ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు.
అయితే ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ, అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు.
ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య(చిరంజీవి). బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ మొదలు ‘ భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్లు సాధించాయి. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీస్తే, ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్లో ఉండడం సహజం.
ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం మెగాస్టార్ కు అలవాటు ‘ఆచార్య’గా తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. లాహే లాహే పాటతో పాటు స్పెషల్ సాంగ్‌కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్ చరణ్. ప్రతి సీన్లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం అంతంత మాత్రమేనని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఓకే. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ని తెరపై చక్కగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
టైటిల్ : ‘ఆచార్య’
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
దర్శకుడు: కొరటాల శివ
సంగీతం: మణిశర్మ