మాస్కో: నాటోలో చేరాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫిన్లాండ్‌కు రష్యా తన తొలి దెబ్బ రుచి చూపించింది. రష్యా ఫిన్లాండ్‌కు చేసే విద్యుత్తు సరఫరాను శనివారం నుంచి నిలిపేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు.
నాటోలో చేరేందుకు ఫిన్లాండ్ చాలా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలని ఫిన్లాండ్ నాటోకు విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా.
ఈ నేపథ్యంలో మే 14వ తేదీ నుండి విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్‌కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన తమకు ఎటువంటి నష్టం లేదని తెలిపింది. రష్యా నుండి సరఫరా చేసుకునేది కేవలం కొద్ది శాతమే కాబట్టి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు.