అమరావతి: గత వైసీపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ వర్సిటీ పేరును తొలగించి వైఎస్సార్ వర్సిటీ అని పేరు పెట్టీన సంగతి విదితమే.
కాగా, ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తాజాగా, విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించింది.
ఈ బిల్లును ఈ రోజు శాసనసభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఆ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం లభించింది.
ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ఇవాళ ప్రకటించారు. దాంతో, సభలోని ఎమ్మెల్యేలు అందరూ అమోడం తెలుపుతూ బల్లలపై చరుస్తూ హర్షం తెలిపారు.
గతంలో ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చుతూ జగన్ ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకుంది.
ఆరోజు, ఆ సర్కారు తీర్మానం చేయగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దానికి ఆమోదం తెలిపారు.
ఇక గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆ బిల్లును చట్టంగా మార్చిన క్రిత వైసీపీ ప్రభుత్వం దానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ తదితరులు భగ్గుమన్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ మరియు సీపీఐ రామకృష్ణ కూడా పేరు మార్పుపై ఆ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.