వాషింగ్టన్: కరోనా టెస్టులు చేయదంలో ప్రపంచంలో అమెరికాలో చేసినన్ని కరోనా టెస్టులు మరెక్కడా జరగలేదని అంటున్నారు వైట్ హౌస్ అధికారులు. కరోనా టెస్టుల చేసే విషయంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, భారత దేశం తమ తర్వాతి స్థానంలో ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఇప్పటికే 42మిలియన్ల టెస్టులు చేసి ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. మా తూరువాత 12 మిలియన్ల టెస్టులతో భారత్ రెండవ స్థానంలో ఉంది’ అన్నారు. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3.5 మిలియన్లుగా ఉండగా 1,38,000 మరణాలు సంభవించాయి.
కరోనను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధి గురించి కైలీ మాట్లాడుతూ.. మోడరనా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు మంచి సంకేతాలను చూపిస్తున్నారన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మందిలో సానుకూల, తటస్థ రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఇప్పటికే కరోనా నుండి కోలుకున్న రోగులతో దీన్ని పోల్చి చూడగా ఆ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపారు. ‘ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే.. కరోనా వ్యాక్సిన్ ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో.. చివరకు అదే లభిస్తుంది అన్నారు. ముఖ్యంగా మోడరనా వ్యాక్సిన్ జూలై చివరి నాటికి మూడవ దశకు చేరుకుంటుంది’ అని కైలీ తెలిపారు. దీనిలో 30,000 మంది పాల్గొంటారన్నారు.