అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు కేసులు నమోదు అయిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి వస్తుండగా, ఏపీ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అయితే, పవన్‌పై విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.
ఇది మాత్రమే కాకుండా, విశాఖపట్నంలో హోటల్‌లో నిర్బంధించిన విషయం కూడా తెలిసిందే. అప్పుడు కూడా పవన్ తమ విధులను అడ్డుకున్నారని మరో కేసు నమోదు చేశారు. కాకినాడలో గత ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా పవన్, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పలు జిల్లాల్లో పవన్‌పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. అనతపురం, కాకినాడ, గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పవన్ కల్యాణ్‌పై కేసులు నమోదు అయ్యాయి.
గుంటూరు స్థానిక కోర్టు ఈ కేసులను విచారణకు స్వీకరించింది. గతంలో రెండు సార్లు విచారణ చేసి పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం మారడంతో, పూర్వం నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలని సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం మారిపోవడంతో పవన్ మీద గతంలో నమోదైన కేసులను సర్కారు వెనక్కి తీసుకుంటోందని, దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ పెండింగులో ఉందని న్యాయవాదులు తెలిపారు. పవన్ కల్యాణ్‌తో పాటు పలువురిపై నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పత్రాలను గుంటూరు కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు హైకోర్టు అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
తుది తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా
పవన్ కల్యాణ్‌పై కేసుల విచారణను వాయిదా వేయాలని న్యాయవాదులు కోరగా, న్యాయాధికారి అంగీకరించారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఈ కేసులను మూడు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.