న్యూఢిల్లీ: యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కేంద్రం ఝలక్ ఇచ్చేలా ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై మళ్లీ కదలిక వచ్చింది.
కేంద్రం తేనున్న కఠిన నిబంధనలతో ఇండిపెండెంట్ జర్నలిస్టులు, సోషల్ మీడియాపై ఆధారపడి నడిచే వార్తా సంస్థలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ బిల్లుపై ప్రభుత్వం పాటిస్తున్న గోప్యత కారణంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షాలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గతేడాది విడుదలైంది.
ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది.
ఎన్నికలు ముగిసిన తరువాత, మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, మరోసారి బిల్లు గురించి చర్చ ప్రారంభమైంది.
సవరించిన బిల్లులోని బయటకు వచ్చిన అంశాలు:
- డిజిటల్ వార్తా ప్రసారకులు: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. 30 రోజుల్లో వారు తమ పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించి నమోదు చేసుకోవాలి.
- మూడంచెల నియంత్రణ: డిజిటల్ వార్తా ప్రసారకులు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందకు రానున్నారు.
- కార్యాలయాల తనిఖీ: డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలను ప్రభుత్వాధికారులు ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. పరికరాలు స్వాధీనం చేసుకోవచ్చు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిపై నిషేధం అమలు చేయవచ్చు.
- సమాచారం అందజేయడం: మెటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలు ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని అందించాలి.
- ఆన్‌లైన్ యాడ్ నెట్‌వర్క్స్: గూగుల్ యాడ్‌సెన్స్, ఫేస్‌బుక్ ఆడియెన్స్ నెట్‌వర్క్ వంటి ఆన్‌లైన్ యాడ్ నెట్‌వర్క్‌లు కూడా ఈ బిల్లు కిందకు వస్తాయి.
అయితే సోషల్ మీడియా వేదికలు ఇండిపెండెంట్ జర్నలిస్టులకు, చిన్న వార్తా సంస్థలకు ముఖ్యమైన వనరుగా మారాయి. ఈ బిల్లు వల్ల వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.