ఢిల్లీ: ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసును సుమోటుగా స్వీకరించి విచారణ జరిపిన సుప్రీం కోర్టు, కేంద్రం మరియు ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ సెంటర్లు డెత్ ఛాంబర్స్ గా మారాయని సీరియస్ అయ్యింది.
వరదలో ముగ్గురు విద్యార్థుల మృతి
జూలై 27న రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లర్ లైబ్రరీలో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సి విద్యార్థులు తానియా సోని, శ్రేయ యాదవ్, నవీన్ డాల్విన్ మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలం
సివిల్ సర్వీస్ విద్యార్థుల మృతితో కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చిందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటించిన తర్వాతే కోచింగ్ సంస్థకు అనుమతి ఇవ్వాలని సూచించింది.
కోచింగ్ సెంటర్ల భద్రతా ప్రమాణాలు
కోచింగ్ సంస్థల్లో నిర్దేశిత భద్రతా ప్రమాణాలను లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు కేంద్రం మరియు ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. సమస్యలకు అనుగుణంగా సమర్థవంతమైన యంత్రాంగాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని స్పష్టం చేసింది.
భద్రతా నిబంధనలు, కోర్టు ఆదేశాలు
యూనిఫైడ్ బిల్డింగ్ బై లాస్ 2016 ప్రకారం నిర్దేశించిన భద్రతా నిబంధనల్లోని ఫైర్ ఎన్ఓసీ మరియు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ 2023 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం, సరైన వెంటిలేషన్, సేఫ్టీ ప్యాసేజ్, ఎయిర్ అండ్ లైట్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు మరియు చట్టం నిర్దేశించిన ఇతర అవసరాలు అవసరమని పేర్కొంది. ఈ ప్రదేశాలు డెత్ ఛాంబర్లుగా మారాయని, కోచింగ్ సెంటర్లు ఆన్లైన్లో కార్యకలాపాలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
విద్యార్థుల నిరసన
కోచింగ్ సెంటర్లలో మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, వివిధ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల వద్ద విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, కోచింగ్ సెంటర్ భవనం ఎదుట బైఠాయించి ప్రాణాలు కోల్పోయిన తమ స్నేహితులను గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీ కోచింగ్ ఎడ్యుకేషనల్ సెంటర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ముసాయిదాను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.