అమరావతి: సచివాలయంలో కలెక్టర్ల సదస్సు సందర్భంగా రెవెన్యూ శాఖపై స్పెషల్ సీఎస్ ఆర్‌పీ సిసోదియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంలో ఆయన రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. సిసోదియా మాట్లాడుతూ, అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని, రెవెన్యూ కార్యాలయాల్లో భూ రికార్డులు భద్రపరచాలని సూచించారు.
“సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు జాగ్రత్తగా ఉంచాలి. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు. క్షేత్రస్థాయి పిటిషన్లు సీఎం దగ్గరకు వస్తే కలెక్టర్లు విఫలమైనట్లే. రికార్డులు భద్రపరిచే విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలి,” అని ఆయన పేర్కొన్నారు.
సిసోదియా వ్యాఖ్యానిస్తూ, “ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో చాలా వరకు రెవెన్యూ శాఖ సంబంధితవే. భూములు లాగేసుకున్నారనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. పత్రాలు తమ వద్దే ఉన్నా, భూ వివాదంలో ఉన్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు భూ సమస్యలపై దృష్టిసారించాలి. కలెక్టర్లపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి. కలెక్టర్లు అందుబాటులో ఉండట్లేదు, కలవట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి,” అని అన్నారు.
“రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. సేల్, గిఫ్ట్, తనఖా పేర్లతో అనుమానాస్పద రిజిస్ట్రేషన్లు చేశారు. అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ చేయాలి. అనర్హులకు అసైన్డ్ భూములు కట్టబెట్టారు. కొందరికి తక్కువ ధరకే ఇచ్చారు,” అని సిసోదియా తెలిపారు.
ఎక్సైజ్ శాఖ ప్రజెంటేషన్:
ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఎన్‌డీపీఎల్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా నిఘా పెట్టాలి. ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మరింత నిఘా పెట్టాలి. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం ఎక్కడికి వెళ్లిందో అందరూ చూశారు. నెల రోజుల్లో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం వస్తుంది,” అని తెలిపారు.
పౌరసంబంధాల శాఖపై ప్రజెంటేషన్:
పౌరసంబంధాల శాఖపై ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన వార్తల విశ్లేషణ కోసం ఏఐ టూల్‌ను సీఎంకు చూపించారు. “సమాచార యుద్ధం ఫీల్డ్ నుంచి ఫీడ్ వరకు వచ్చింది. దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏది నిజం, ఏది దుష్ప్రచారం అనేది ప్రజలకు తెలపాలి. జిల్లా స్థాయిలో మీడియా మానిటరింగ్ టీమ్‌లు ఉండాలి. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగితే తిప్పికొట్టే వ్యవస్థ ఉండాలి,” అని పేర్కొన్నారు.