దుబాయ్: అక్టోబర్ లో నిర్వహించాల్సిన టి20 ప్రపంచకప్ భవితవ్యం సోమవారం అంతర్జాతీయ కికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో తేలనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఈవెంట్ అక్టోబర్ 18 నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా లో జరగాల్సి ఉంది.
అయితే ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆస్ట్రేలియా ఈ ఈవెంట్ ను ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశంలో నిర్వహించడం వీలు కాదని చెప్పింది. ఇక ఇప్పుడు ఐసీసీకి ఈ ప్రపంచకప్ ని వాయిదా వేయడం తప్ప వేరే దారేమి లేదు.
ఈ ఈవెంట్ పైనే ఐపీఎల్ షెడ్యూల్ కూడా ఆధారపడి ఉంది. ఇప్పటికే యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను వేదికగా బీసీసీఐ ఖరారు కూడా చేసుకుంది. భారత దేశ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ నిర్వహించలేమని, విదేశీ వేదికగా జరుపే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే సౌరవ్ గంగూలీ ప్రకటించారు. దీని కోసం ఆసియా కప్ కూడా వాయిదా వేయించారు.
దేశంలో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ విదేశీ వేదికను ఖరారు చేసుకుని ప్రపంచకప్ పై ఐసీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. వారి నిర్ణయం సానుకూలంగా ఉంటే ఐపీఎల్-13 నిర్వహణకు అడ్డు తొలగినట్లే. లేకుంటే బీసీసీఐకు రూ 4,000 కోట్లు నష్టం వాటిల్లుతుంది.