విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. పదికి పది స్థానాలూ పొంది, కూటమి విజయకేతనం ఎగురవేసింది.
ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి మరీ పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా, మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు!
మూడు సంవత్సరాల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరుమీదున్న కూటమి, స్థాయీ సంఘ ఎన్నికలను మూడేళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
వైకాపా నుంచి క్రాస్ ఓటింగ్:
స్థాయీ సంఘ ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. పది స్థానాలకు వైకాపా, తెదేపా అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరఫున పోటీలో నిలిచిన పది మంది తెదేపా అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలూ కూటమి వశమయ్యాయి.
విజేతలు:
- విల్లూరి భాస్కరరావు – 66 ఓట్లు
- గొలగాని వీరారావు – 65 ఓట్లు
- పిసిని వరాహ లక్ష్మీ నరసింహం – 65 ఓట్లు
- గల్లా పోలిపల్లి – 64 ఓట్లు
- బొమ్మిడి రమణ – 64 ఓట్లు
- బల్ల శ్రీనివాసరావు – 60 ఓట్లు
- శరగడం రాజశేఖర్ – 60 ఓట్లు
- నొల్లి నూకరత్న – 58 ఓట్లు
- లక్ష్మీబాయి పులి – 56 ఓట్లు
- పిళ్లా మంగమ్మ – 54 ఓట్లు
కూటమి బలం:
వైకాపా బలం ఎన్నికలకు ముందు 47గా ఉండగా, అనూహ్య పరిణామాలు జరిగాయి. నలుగురు కార్పొరేటర్లు శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కు చేరింది. గెలిచిన తెదేపా అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే, వైకాపా నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది. ఒకటి నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైకాపా కార్పొరేటర్లు తెదేపా అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం.
కూటమి సంబరాలు:
స్థాయీ సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు జీవీఎంసీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు.
గెలుపొందిన సభ్యులను కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అభినందించి సన్మానించారు.
భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకుంటుందని విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఎన్నిక సమయంలో శిబిరం నుంచి కార్పొరేటర్లతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు జీవీఎంసీ వద్దకు వచ్చారు.
వైకాపా కార్పొరేటర్ల నిరసన:
ఇది ఇలావుండగా, ఓట్ల లెక్కింపు సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైకాపా కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను జీవీఎంసీ ప్రవేశ ద్వారం ముందు నిరసన వ్యక్తం చేశారు.
బ్యాలట్‌పై స్వస్తిక్ మార్క్ తప్ప ఎలాంటివీ ఉండకూడదని, కొన్ని బ్యాలట్లపై పెన్సిల్ గుర్తులున్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనర్హత ఓట్లు తీసేసి మిగిలినవి లెక్కించాలంటూ డిమాండ్ చేశారు.
భారీ పోలీసు బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి గెలిచిన సభ్యులను కమిషనర్ సంపత్‌కుమార్ ప్రకటించారు.