మూవీడెస్క్: ఈ సంవత్సరం ఇండియన్ సినిమా ప్రపంచంలో ప్రభాస్ నటించిన కల్కి 2898AD ఒక సంచలనం సృష్టించింది.
పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా, అన్ని ప్రధాన మార్కెట్లలో అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంది.
అయితే, కొన్ని ముఖ్యమైన రికార్డులను కొద్దిలోనే చేజార్చుకున్నట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కల్కి 2898ఏడీ సినిమా ఇప్పటి వరకు 1150 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అందుకుంది. బాహుబలి 2 తరువాత, ప్రభాస్ ఖాతాలో చేరిన మరో భారీ విజయం ఇది.
ముఖ్యంగా, నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా 18.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి, బాహుబలి 2 తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.
20.77 మిలియన్ డాలర్స్ కలెక్షన్ సాధించిన బాహుబలి 2 రికార్డును కల్కి మించడంలో కొద్దిలో తప్పి, మరో రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసి ఉంటే, ఈ రికార్డు బద్దలు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలాగే, హిందీ మార్కెట్‌లో సౌత్ డబ్బింగ్ మూవీల్లో కల్కి టాప్ 3లో నిలిచింది. కానీ, 300 కోట్ల కలెక్షన్స్ మార్క్ చేరుకోవాలని భావించినా, కల్కి 290 కోట్ల వద్దే ఆగిపోయింది.
ఈ రెండు రికార్డులను సాధించడానికి కొద్దిగా తేడా పడటం, చిత్రబృందం మరియు అభిమానుల మనసుల్లో కాస్త నిరాశను కలిగించిందనే మాట వినిపిస్తోంది.