అమరావతి: వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పేరు తొలగింపు!!!
విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పేరు తొలగింపు!
గత ప్రభుత్వ హయాంలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ న్యాయ మహాశిల్పం ప్రతిష్ఠించి, విగ్రహ పీఠంపై ఆవిష్కర్తగా అప్పటి సీఎం జగన్ పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అంబేడ్కర్ పీఠంపై ఏర్పాటు చేసిన వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పేరుగల స్టీల్ అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి తొలగించారు. అయితే, ఈ పని ఎవరు చేశారు, ఎవరి ఆదేశాలపై చేశారు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై వైకాపా శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. స్వరాజ్య మైదానం వద్ద లైట్లు ఆర్పి, జగన్ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించారని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు మైదానం వద్దకు చేరుకుని, గేట్లు మూసి ఉండటం, లోపల ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు.
శుక్రవారం, విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసిపి నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
ఈ నిరసనలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదని, ఈ ఘటన రాష్ట్ర పాలకుల అంబేడ్కర్ విగ్రహాన్ని భక్షించాలనే ఉద్దేశాన్ని చూపుతోందని ఆరోపించారు.
అదనంగా, ఈ ఘటనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటన పై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మేరుగ నాగార్జున తెలిపారు. వైసిపి తరపున గ్రామ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేయాలని పిలుపునిచ్చారు.