అమరావతి: భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టుగా మారింది.
కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను పరిశీలించిన అనంతరం, విమానాశ్రయం ఉత్తరాంధ్ర రూపురేఖలను పూర్తిగా మార్చే శక్తిని కలిగిఉందని తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనుల్లో నెలనెలా పురోగతిని ప్రజలకు తెలియజేస్తున్నామని, ఈ నెలలో 4 శాతం పురోగతి సాధించామని వెల్లడించారు.
ఇప్పటివరకు మొత్తం పనులలో 36 శాతం పూర్తి చేసామని, నిర్మాణ పనులు అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేయాలని కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ ను ముందుగా పూర్తి చేయడానికి జీఎంఆర్, ఎల్అండ్టీ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని మంత్రి తెలిపారు.
అదనంగా, శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ ప్రాంతాలలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు యోచిస్తున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఈ నిర్ణయం వల్ల ప్రాంతీయ అభివృద్ధి మరింత ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది.